Breaking News

సికింద్రాబాద్‌ అస్థిత్వంపై కుట్ర జరుగుతోంది: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సికింద్రాబాద్‌ అస్థిత్వంపై కుట్ర జరుగుతోంది: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


Published on: 09 Jan 2026 10:46  IST

సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక గుర్తింపు కలిగిన సికింద్రాబాద్‌ను బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సికింద్రాబాద్‌ ప్రత్యేకతను దెబ్బతీయాలనే దిశగా అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు.

గురువారం పద్మారావునగర్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని, సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఈ నెల 11న బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపార, కార్మిక సంఘాల నాయకులు, అలాగే వివిధ కాలనీలు, బస్తీల కమిటీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

ఈ సమావేశంలో సికింద్రాబాద్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, ఈ నెల 17న నిర్వహించనున్న భారీ ర్యాలీపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగే వరకు ఉద్యమం ఆగదని తలసాని స్పష్టం చేశారు. అవసరమైతే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని హెచ్చరించారు.

ఈ ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని, సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటమని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి, ఈ ప్రాంత చరిత్రను విస్మరించి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి