Breaking News

ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై ఒత్తిడి పెంచే కొత్త బిల్లు

ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై ఒత్తిడి పెంచే కొత్త బిల్లు


Published on: 08 Jan 2026 10:55  IST

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక అడుగు వేశారు. రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడి మరింత పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షలకు సంబంధించిన బిల్లుకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా భారత్‌–చైనా వంటి దేశాలపై ప్రభావం చూపేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ బిల్లులో భాగంగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ ఆర్థిక చర్యలు తీసుకునే ప్రతిపాదన ఉంది. ముఖ్యంగా భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తే, వాటిపై 500 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికాకు లభించనుంది.

ఈ విషయాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్ లిన్సే గ్రాహం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల ట్రంప్‌తో భేటీ అయినట్లు, ఆ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షలు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకునే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం అమెరికా పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనున్నట్లు కూడా వెల్లడించారు.

గ్రాహం మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసకు రష్యా చమురు ద్వారా నిధులు సమకూరుతున్నాయని ఆరోపించారు. అలాంటి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలు యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఇకపై ఈ దేశాలు రష్యా చమురును కొనకుండా అడ్డుకునేలా ఈ బిల్లు రూపొందించబడిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ టారిఫ్‌లు తప్పవని స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటలు చెబుతూనే, అమాయక పౌరులపై దాడులు కొనసాగిస్తున్నారని గ్రాహం తీవ్రంగా విమర్శించారు. ఈ పరిస్థితిని అడ్డుకోవాలంటే కఠిన ఆర్థిక చర్యలు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.

రష్యా చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ అంశంపై ట్రంప్ మొదటి నుంచే అసంతృప్తితో ఉన్నారు. గతేడాది ఇదే కారణంతో భారత దిగుమతులపై ఇప్పటికే భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

ఇక మరోవైపు, భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ బిల్లుకు ట్రంప్ మద్దతు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో రెండు దేశాల ఆర్థిక సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి