Breaking News

ప్రాణాలు పోతున్నా తగ్గని పన్ను: ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గింపునకు మోడీ సర్కార్ 'NO'

ప్రాణాలు పోతున్నా తగ్గని పన్ను: ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గింపునకు మోడీ సర్కార్ 'NO'


Published on: 09 Jan 2026 18:52  IST

దేశంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు స్వచ్ఛమైన గాలికోసం ఇబ్బంది పడుతున్నారు. గాలి నాణ్యత క్షీణించడంతో ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లు అవసరమైన ఆరోగ్య పరికరాలుగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అయితే, ఎయిర్ ప్యూరిఫయర్ల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆవేదన వినిపిస్తోంది. ప్రస్తుతం వీటిపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాల ప్రశ్నగా మారిన ఈ అంశంలో పన్నును తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ, ఈ విషయంలో తక్షణ మార్పులు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన

ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వాదనను వినిపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A ప్రకారం, జీఎస్టీ రేట్లను నిర్ణయించే అధికారం పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్‌కే ఉంటుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం స్వయంగా పన్ను రేట్లలో మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

జీఎస్టీ రేట్లలో మార్పు అనేది ఒక సాదా పరిపాలనా నిర్ణయం కాదని, దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సమ్మతి అవసరమని కోర్టుకు వివరించింది. అందుకే ఈ విషయంలో కేంద్రం ఒంటరిగా నిర్ణయం తీసుకునే అవకాశమే లేదని తెలిపింది.

బడ్జెట్ తర్వాతే స్పష్టత?

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌కు ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగే అవకాశాలు లేవు. కేవలం ఎయిర్ ప్యూరిఫయర్ల పన్ను అంశం కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కష్టమని చెబుతున్నారు. బడ్జెట్ తర్వాత జరిగే కౌన్సిల్ సమావేశంలోనే ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

కొంతమంది ఢిల్లీ వంటి తీవ్ర కాలుష్యం ఉన్న నగరాలకు మాత్రమే పన్ను రాయితీ ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే జీఎస్టీ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా పన్ను రేట్లు ఒకేలా ఉండాల్సి ఉంటుందని, ఒక ప్రాంతానికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం

ఎయిర్ ప్యూరిఫయర్లను ఎలక్ట్రానిక్ వస్తువులుగా పరిగణనలోకి తీసుకున్నందున, వీటిపై జీఎస్టీ తగ్గిస్తే రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సామాన్యుడి ఆవేదన ఏమిటంటే…

కేంద్రం చెప్పే నిబంధనలు ఒకవైపు ఉంటే, సామాన్య ప్రజల బాధ మరోవైపు ఉంది. ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం కారణంగా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు, ప్రాణాలు కాపాడే ఎయిర్ ప్యూరిఫయర్లు కొనుగోలు చేయడం భారంగా మారిందని వాపోతున్నారు. కనీసం 18 శాతం పన్నును 5 శాతానికి తగ్గిస్తే కొంతమందైనా వీటిని కొనగలుగుతామని ఆశిస్తున్నారు.

ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్ తర్వాతైనా జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని ప్రజలకు ఊరటనిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి