Breaking News

వెనెజువెలా చమురుపై ట్రంప్‌ కన్ను.. విక్రయించగా వచ్చిన డబ్బుపై అమెరికా అజమాయిషీ

వెనెజువెలా చమురుపై ట్రంప్‌ కన్ను.. విక్రయించగా వచ్చిన డబ్బుపై అమెరికా అజమాయిషీ


Published on: 07 Jan 2026 10:19  IST

వెనెజువెలా చమురుకు సంబంధించిన అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉన్న అధిక నాణ్యత గల చమురును అమెరికాకు అప్పగించేందుకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అంగీకరించిందని ఆయన ప్రకటించారు. ఈ చమురు విక్రయం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా తన నియంత్రణలోనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక అయిన ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు.

వెనెజువెలాపై సైనిక చర్యలు చేపట్టి, అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న కొన్ని రోజులకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వెనెజువెలా అధికారులు మార్కెట్ ధరలకే ఈ చమురును అమెరికాకు విక్రయిస్తారని, అందువల్ల వచ్చే ఆదాయాన్ని వెనెజువెలా ప్రజలు, అమెరికా ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తానని ట్రంప్ తెలిపారు.

ఈ చమురు అప్పగింత ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని ట్రంప్ వెల్లడించారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్‌కు తాను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వెనెజువెలాలోని చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి, నేరుగా అమెరికా ఓడరేవులకు చేర్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, వెనెజువెలాకు చెందిన చమురు కంపెనీలతో వైట్ హౌస్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగే ఈ సమావేశానికి ఎక్సాన్, చెవ్రాన్, కోనోకోఫిలిప్స్ వంటి ప్రముఖ చమురు సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో చమురు సరఫరా, పెట్టుబడులు, భవిష్యత్ ఒప్పందాలపై చర్చ జరగనుందని సమాచారం.

మరోవైపు, దేశీయ రాజకీయాలపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2026లో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పనితీరుపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల చట్టసభ సభ్యులకు ఇచ్చిన విందులో మాట్లాడుతూ, ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోతే డెమోక్రాట్లు తనపై అభిశంసనకు ప్రయత్నించే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే రాబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు తప్పనిసరిగా విజయం సాధించాలని పార్టీ నేతలకు ట్రంప్ పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి