Breaking News

దేశవ్యాప్తంగా బాంబు దాడుల కుట్ర – వైద్యుల గ్యాంగ్‌పై షాకింగ్ వివరాలు

దేశవ్యాప్తంగా బాంబు దాడుల కుట్ర – వైద్యుల గ్యాంగ్‌పై షాకింగ్ వివరాలు


Published on: 14 Nov 2025 10:10  IST

దేశంలో నాలుగు ప్రధాన నగరాల్లో ఒకేసారి బాంబు పేలుళ్లు జరిపేందుకు వైద్యులే ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఉమర్, ముజమ్మిల్, ఆదిల్, షాహీన్‌ అనే నలుగురు వైద్యులు రూ.26 లక్షలు సమకూర్చుకుని, దాడులకు అవసరమైన పేలుడు పదార్థాలు రవాణా చేయడానికి 32 పాత కార్లు కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 8 మంది కలిసి నాలుగు నగరాల్లో ఐఈడీ దాడుల కోసం స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

దిల్లీ ఎర్రకోట పేలుడు – ఉమర్ నబీయేనని డీఎన్‌ఏ ధృవీకరణ

దిల్లీలో ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన ఘోర కారుపేలుడులో కనుగొనబడిన శరీర అవశేషాలపై డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా, ఆ కారు నడిపింది అల్-ఫలా విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్‌ ఉన్ నబీ అని నిర్ధారణ అయింది.
కారు స్టీరింగ్‌–యాక్సిలరేటర్ మధ్య చిక్కుకున్న కాలు భాగాన్ని అతడి తల్లి డీఎన్‌ఏతో పోల్చగా సరిపోయింది.

ఈ ఘటనలో గురువారం మరో గాయపడిన వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య 13కు పెరిగింది. పేలుడు శక్తి ఎంత తీవ్రంగా ఉందో, సమీప దుకాణం పైకప్పుపై తెగిపోయిన చెయ్యి కూడా లభించింది.

ఘటనాస్థలిలో నుండి రెండు కార్లు (వైట్‌ ఐ20, రెడ్ ఎకోస్పోర్ట్) మరియు ఫరీదాబాద్‌లోని విశ్వవిద్యాలయం వద్ద మరొక బ్రెజ్జా కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎకోస్పోర్ట్ కారులో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించాయి.

దేశవ్యాప్తంగా మరిన్ని దాడుల ప్రణాళిక

దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు సంగ్రహించిన సమాచారంతో, ఈ గ్రూప్ నాలుగు నగరాల్లో ఒకేసారి పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అత్యవసర సమీక్ష కూడా నిర్వహించారు.

రెండు మంది అదుపులో – జమ్మూ కశ్మీర్ లింక్ స్పష్టంగా

ఫరీదాబాద్ మాడ్యూల్‌కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అధికారులు పెద్ద ఎత్తున దర్యాప్తు జరుపుతున్నారు.
ఇప్పటికే:

  • హాపుర్‌లో జీఎస్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫారూఖ్

  • కాన్పూర్‌లో కార్డియాలజీ పీజీ విద్యార్థి డాక్టర్ మహ్మద్ ఆరిఫ్ మీర్ (32)

అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరూ జమ్మూ కశ్మీర్‌ వాసులే.

ఆరిఫ్ ఇంటిపై దాడి చేసినప్పుడు అతడు ఫోన్‌లోని డేటా తొలగించేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.

వీళ్లందరూ సమాచార మార్పిడికి ఒకే ఇమెయిల్ ఐడీని ఉపయోగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఉమర్ – ముజమ్మిల్ మధ్య గొడవే పేలుడుకు కారణమా?

దాడుల కోసం వారు 26 క్వింటాళ్ల ఎరువులు కొనుగోలు చేసిన రికార్డులు బయటపడ్డాయి. ఈ కొనుగోలుపై డబ్బు వినియోగంపై ఉమర్, ముజమ్మిల్ మధ్య తలెత్తిన వాగ్వాదం వల్లే కారు ముందుగానే పేలిపోయింది కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఉమర్‌ నబీ తొలగించిన డబ్బులు, నిర్వహణ ఖర్చులు, రవాణా వివరాలపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

డైరీల్లో బాంబు దాడుల షెడ్యూల్ – 25 మంది పేర్లు

ఉమర్‌ మరియు ముజమ్మిల్‌తో పాటు మరిన్ని వ్యక్తులపై అనుమానాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి.
వారి డైరీల్లో:

  • నవంబర్ 8 నుంచి 12 వరకు దాడుల ప్రణాళిక

  • 25 మంది పేర్లు (జమ్మూ, ఫరీదాబాద్ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువ)

  • అర్థం కాని రహస్య కోడ్లు, సంకేతాలు

ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ గ్రూప్ ఐసిస్ అనుబంధ సంస్థ అన్సార్ గజ్వతుల్ హింద్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి